జుజ్జులరావుపేట మాజీ సర్పంచ్ .... మాజీ ఎంపీటీసీ కారు దిగి కాంగ్రెస్ బాట
ఎన్నికలు ముగిసినా ఆగని చేరికల జోరు.. హస్తం గూటికి 45 కుటుంబాలు
మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిక
ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 31(తెలంగాణ ముచ్చట్లు)
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినా బిఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేతలే గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు. మాజీ సర్పంచ్ పడిశాల గోపి, మాజీ ఎంపీటీసీ బారి నాగేశ్వరరావు తమ అనుచర వర్గంతో కలిసి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ బాట పట్టారు. ప్రధాన నేతల మూకుమ్మడి వలస
కంచర్ల జీవన్ రెడ్డి నాయకత్వంలో గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ కార్యదర్శి శ్రీరాముల రాము, మల్లెబోయిన వీరభద్రం, పడిశాల మహేష్ సహా దాదాపు 45 కుటుంబాలు బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాయి. గ్రామంలో ఆ పార్టీకి వెన్నెముకగా ఉన్న నేతలే ఒక్కసారిగా పార్టీ వీడటంతో జుజ్జులరావుపేటలో బిఆర్ఎస్ ఖాళీ అయినట్లయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజాక్షేమ పథకాలు, నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తమను కాంగ్రెస్ వైపు నడిపించాయని ఈ సందర్భంగా పడిశాల గోపి, నాగేశ్వరరావు పేర్కొన్నారు. "ప్రజల పక్షాన నిలిచే నాయకత్వమే మాకు ముఖ్యం.. అందుకే కాంగ్రెస్‌లో చేరాం" అని వారు స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో పట్టున్న నాయకులు హస్తం గూటికి చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొని కొత్తగా చేరిన వారికి ఆహ్వానం పలికారు.


Comments