సత్తుపల్లిలో ఘనంగా మట్టా దయానంద్ పుట్టినరోజు వేడుకలు.
- వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు.
- భారీ బైక్ ర్యాలీ – సేవా కార్యక్రమాలు.
సత్తుపల్లి, జనవరి 3 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పుట్టినరోజు వేడుకలు శనివారం అట్టహాసంగా నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలోని రాణి సెలెబ్రేషన్స్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ, ప్రజల ప్రేమాభిమానాలు తమ కుటుంబానికి లభించిన గొప్ప బలం అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ, యువతను పేకాట, కోడిపందాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి దుష్ప్రవర్తనల బారిన పడకుండా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడనివ్వబోమని హెచ్చరించారు.
ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై విచారణ జరిపి, త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షులకు నివేదిక అందజేస్తామని తెలిపారు.
రాబోయే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వెంగలరావు కాలనీ నుంచి పాత సెంటర్ మీదుగా వేంసూరు రోడ్‌లోని రాణి సెలెబ్రేషన్స్ ఫంక్షన్ హాల్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వేలాది మంది కాంగ్రెస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేశారు. అదే వేదికపై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
డాక్టర్ మట్టా దయానంద్ పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు బెంచీలు, మైనారిటీ గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులకు టేబుల్ ఫ్యాన్లు అందజేశారు. సత్తుపల్లి పట్టణంతో పాటు సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా బంధువుగా పేరొందిన డాక్టర్ మట్టా 
దయానంద్ పుట్టినరోజు వేడుకలు వేలాది మంది ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా ముగిశాయి.


Comments