ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార వేడుకలు
ఎల్కతుర్తి. డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, ఎల్కతుర్తి, సూరారం, వల్లభాపూర్, వీరనారాయణపూర్, ఇంద్రనగర్, దామెర, చింతలపల్లి, తిమ్మాపూర్, జిలుగుల, పెంచికలపేట్ తదితర గ్రామాల్లో గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకార వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించడంతో గ్రామాల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది.
ఎన్నికల అనంతరం కొంతకాలంగా నిర్వీర్యంగా ఉన్న గ్రామపంచాయతీలు మళ్లీ చైతన్యవంతమయ్యాయి. డప్పులు, బాణాసంచా, పూలతోరణాలతో గ్రామస్తులు ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించగా, పలుచోట్ల మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని పంచుకున్నారు. గ్రామాలన్నీ పండుగ వాతావరణంతో కళకళలాడాయి.
ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన సర్పంచులు, ఉప సర్పంచులు గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, విద్యా–ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శకంగా పనిచేస్తామని తెలిపారు.
గ్రామస్తుల సహకారంతో సమర్థవంతమైన పాలన అందించి, గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


Comments