ఘనంగా శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి చిత్రపటానికి నివాళులు
ఏ ఎస్ రావు నగర్, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం – స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి కార్యక్రమాన్ని సోమవారం కమలానగర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. ముందుగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ప్రజాతంత్ర ఉద్యమ సీనియర్ నాయకులు వెంకటయ్య, స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు జంపాల శ్రీమన్నారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంలో చేసిన విశేష పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. గణిత రంగంలో ఆయన కనుగొన్న సూత్రాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. బ్రిటిష్ కాలంలోనే ఆయన చేసిన కృషికి ఫెలోషిప్ ఆఫ్ రాయల్ సొసైటీ అవార్డు లభించిందని గుర్తు చేశారు.జంపాల శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, భారతదేశం గణిత శాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా నిలిచిందని అన్నారు. సున్నా ఆవిష్కరణతో సమాజంలో విశేషమైన మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఆ పరంపరలోనే బ్రిటిష్ పాలన కాలంలో శ్రీనివాస రామానుజన్ గణిత రంగంలో అపారమైన కృషి చేశారని చెప్పారు. ఆనాటి భారత సమాజంలో ఆయన పరిశోధనలను సమీక్షించే వ్యవస్థ లేకపోవడంతో బ్రిటిష్ గణిత శాస్త్రవేత్తలకు పంపించగా, వారు ఆయన ప్రతిభను గుర్తించి రాయల్ సొసైటీ ఫెలోషిప్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అనుబంధ గుర్తింపును కల్పించారని తెలిపారు. ఈ కృషి శకుంతలా దేవి వంటి గొప్ప గణిత శాస్త్రవేత్తలు ఎదగడానికి దోహదపడిందని పేర్కొన్నారు.సీనియర్ నాయకులు వెంకటయ్య మాట్లాడుతూ, స్వాతంత్ర్యానికి ముందే శ్రీనివాస రామానుజన్ గణిత మేధావిగా ప్రపంచానికి పరిచయమయ్యారని అన్నారు. అదే కాలంలో సి.వి. రామన్ చేసిన పరిశోధనలు నోబెల్ బహుమతికి దారితీసిన విషయాన్ని గుర్తు చేశారు. నేటి సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని, యువత శాస్త్ర విజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరూ శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు, ఉదయ భాస్కర్, ఎం. శ్రీనివాసరావు, జి. శ్రీనివాసులు, గౌసియా, జి. శివరామకృష్ణ, వెంకటయ్య శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments