రాత్రిపూట బయట తిరగవద్దు
బాలాపూర్ పోలీసులు హెచ్చరిక
బాలాపూర్, డిసెంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
అత్యవసరమైతే తప్ప అర్థరాత్రి వేళల్లో ప్రజలు బయటకు రావద్దని బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ప్రజలను కోరారు. వరుస హత్యల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు, డీసీపీ మహేశ్వరం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో, ఏసీపీ మహేశ్వరం జానకి రెడ్డి పర్యవేక్షణలో బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలో 40 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా రాత్రి పెట్రోలింగ్ చేపట్టారు.అవాంఛనీయ ఘటనలు జరగకుండా అనుమానితులపై నిఘా ఉంచామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా రాత్రివేళల్లో బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారు చెడు అలవాట్లకు బానిస కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు కౌన్సెలింగ్ అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.వ్యాపార సంస్థలు ప్రభుత్వ నిర్దేశిత సమయానికి షాపులు మూసివేసి, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు పరిరక్షించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.


Comments