డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం
ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం
మారేడుపల్లి, ఫిబ్రవరి 05 (తెలంగాణ ముచ్చట్లు):
మారేడుపల్లి ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న తీవ్ర జాప్యానికి నిరసనగా చేపట్టిన ధర్నాకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. మొండామార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొణతం దీపికా నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ, ప్రభుత్వ చేతకాని తనం వల్ల సంవత్సరంన్నర కాలంగా పేదలకు ఇళ్లు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఒక ఎంపీగా ఈ పరిస్థితిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
ఇది మొద్దు ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ప్రజల జీవితాలతో ఆడుకునే వారు, పేదల కన్నీళ్లను చూసే వారు ఎప్పటికీ బాగుపడరని హెచ్చరించారు. ప్రజలంటే, ప్రజాప్రతినిధులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని, ప్రతి ఒక్కరూ తాము మోనార్కుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.2017లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ పేదలకు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఎన్నిసార్లు కలెక్టర్‌ను, శాఖ మంత్రిని, ఇంచార్జ్ మంత్రిని కోరినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ఒక ఎంపీగా కలెక్టర్ కార్యాలయంలో కూడా ధర్నా చేసినప్పటికీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసినా వాటిని సక్రమంగా నిర్మించి పేదలకు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈటల రాజేందర్ అన్నారు. కట్టిన ఇళ్లలో కూడా కనీస సదుపాయాలు లేవని విమర్శించారు.ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని, వెంటనే బాధితులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ ప్రభుత్వానికి పర్యవసానం తప్పదని హెచ్చరించారు. తాను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని, వారు స్పందించకపోతే తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని తెలిపారు.ఈ ధర్నాలో మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి, కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలు నర్మద మల్లికార్జున్, మొండామార్కెట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జితేందర్ గుప్తా, కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకులు వీకే మహేష్, పిట్ల నగేష్, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments