ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా నిర్వహించాలి..
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
ఖమ్మం బ్యూరో, జనవరి -31(తెలంగాణ ముచ్చట్లు)
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓ లతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం అధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటిని సందర్శించి వివరాలు సేకరించాలని, ఓటరు జాబితాలో గల ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు వారి తరపున ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని అన్నారు. జరగబోయే ప్రత్యేక సమగ్ర సవరణ పట్ల రాజకీయ పార్టీలకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పెండింగ్ ఫారం 6, 6ఏ, 7, 8 లను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
ఇట్టి వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఎస్డీసి రాజేశ్వరి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం.ఏ. రాజు, డిటి అన్సారీ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments