స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్య విశ్లేషణ

స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్య విశ్లేషణ

ఏ ఎస్ రావు నగర్, జనవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమల నగర్ సీఐటీయూ కార్యాలయంలో మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కావ్యంపై స్టడీ సర్కిల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు సమన్వయకర్తగా వ్యవహరించారు.కార్యక్రమంలో ముందుగా ప్రముఖ జర్నలిస్టు గుమ్మడి హరిప్రసాద్ మాట్లాడుతూ శ్రీశ్రీ మహాప్రస్థానం కావ్యంపై విస్తృతంగా వివరణ ఇచ్చారు. 1935 నుంచి 1940 మధ్యకాలంలో రచించిన ఎన్నో కీలక కవితలను 1950లో మహాప్రస్థానంగా ప్రచురించినట్లు తెలిపారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్రీశ్రీ ప్రారంభంలో చందోబద్ధమైన రచనలు చేసినప్పటికీ, అవి వాస్తవ జీవితానికి దూరంగా ఉన్నాయని గుర్తించి, మిత్రులు కొంపల్లి జనార్ధన్ వంటి వారి సహచర్యంతో తన కవిత్వాన్ని ప్రజల జీవన సత్యాలకు దగ్గరగా మలిచారని వివరించారు. ఆకాశంలో హడావుడిగా తిరిగే జగన్నాథ రథచక్రాలను భూమార్గం పట్టించినట్లు, చందోబద్ధమైన బావ శృంఖలాలను ఛేదిస్తూ మానవ జీవితానికి అనుగుణమైన నూతన సమాజ నిర్మాణానికి శ్రీశ్రీ గొప్ప రచనలు చేశారని పేర్కొన్నారు. మిత్రుడు జనార్ధన్‌కు అంకితం ఇచ్చి అదే ప్రారంభ కవితగా ఉండటం గొప్ప ఆదర్శమని అన్నారు. అలాగే ఈ పుస్తకానికి చలం రాసిన యోగ్యతాపత్రం మహాప్రస్థానంకి మరింత వన్నె తెచ్చిందని తెలిపారు.సామాజిక ఉద్యమ నాయకులు జయరాజు మాట్లాడుతూ శ్రీశ్రీ కవిత్వం, ముఖ్యంగా మహాప్రస్థానం భావితరాలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఈ శతాబ్దపు కావ్యాలలో మహాప్రస్థానం అగ్రస్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. వారు కూడా కొన్ని కవితలను చదివి వాటి భావాలను విశ్లేషించారు.సమన్వయకర్త గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ మహాప్రస్థానం సోషలిజం మార్గానికి బాటలు వేసిన గొప్ప కావ్యమని, తెలుగు ప్రజానీకానికి దానిని శ్రీశ్రీ అద్భుతంగా అందించారని తెలిపారు. ‘దేశ చరిత్రలు’, ‘భిక్ష వర్షసి’, ‘బాటసారి’, ‘గర్జించు రష్యా’, ‘రథచక్రాలు’ వంటి కవితలను చదివి వాటి భావాలు అందరినీ ఆలోచింపజేశాయని చెప్పారు.కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మహాప్రస్థానంలోని వివిధ కవితలను ఆకళింపు చేసుకొని ప్రశంసించారు. అనంతరం సభ్యులందరూ కలిసి మహాకవి శ్రీశ్రీకి జేజేలు పలికారు. చివరగా సమన్వయకర్త గొడుగు యాదగిరిరావు కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో ఉదయ భాస్కర్, శంకర్ రెడ్డి, పి. మల్లేశం, ఏ.కే. దుర్గాచారులు, జయరాజు, హరిప్రసాద్, సాంసన్, గౌసియా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News