సమ్మక్క–సారలక్క జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు
ఎల్కతుర్తి, జనవరి 29 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామం, బీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామాల్లో జరుగుతున్న సమ్మక్క–సారలక్క మహా జాతరకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించే ఈ మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి రమేష్ ఆదేశాల మేరకు ఎస్సై రాజు, ఎస్సై దివ్య, వేలేరు ఎస్సై సురేష్ నాయక్, ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్ కుమార్‌లతో పాటు ఇతర సిబ్బంది సమన్వయంతో జాతర ప్రాంతంలో పోలీస్ బందోబస్తును కఠినంగా అమలు చేస్తున్నారు. సీఐ పులి రమేష్ స్వయంగా పర్యవేక్షణ చేస్తూ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
జాతర జరుగుతున్న ఈ నెల 28, 29, 30 తేదీల్లో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ పులి రమేష్ మాట్లాడుతూ, జాతర సందర్భంగా భక్తులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. సమ్మక్క–సారలక్క గద్దెల వరకు చేరుకునేంతవరకు శాంతి భద్రతలు పాటిస్తూ పోలీసుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని ఆయన సూచించారు.


Comments