పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
ఖమ్మం బ్యూరో, జనవరి - 27(తెలంగాణ ముచ్చట్లు)
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పారదర్శక నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి శివధర్ రెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అదనపు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, నామినేషన్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, జోనల్, నోడల్ అధికారులు, పర్యవేక్షణ బృందాలు, పిఓ లు, ఎపిఓ లు, ఎన్నికల సిబ్బంది నియామకం ప్రతి అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఎన్నికలలో వినియోగించే బ్యాలెట్ బాక్సులు, సామాగ్రి, బ్యాలెట్ ప్రింటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు, నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అవసరమైన పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, జిల్లాలో 5 మునిసిపాలిటీలు ఏదులాపురం, కల్లూరు, మధిర, వైరా, సత్తుపల్లి పరిధిలో 117 వార్డులకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా వెబ్ కాస్టింగ్, నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, పిఓ లు, ఓపిఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, అధికారుల సమన్వయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పోలీస్ కమీషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్, సిపిఓ శ్రీనివాస్, డిపిఓ రాంబాబు, ఆర్టిఓ జగదీష్, డిసిఓ గంగాధర్, మునిసిపల్ కమిషనర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Comments