పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!
మంత్రి తుమ్మల ప్రయోగానికి మంచి ఫలితం.
అశ్వారావుపేట, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట మండలం, లింగాలపల్లి గ్రామంలో పామాయిల్ తోటల్లో అంతర పంటగా పసుపు సాగు విజయవంతమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన స్వంత వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన ప్రయోగాత్మక సాగు మంచి ఫలితాలను ఇస్తోంది.
సాధారణంగా ఈ ప్రాంతంలో పామాయిల్ సాగు ప్రారంభ దశలో వేరుశెనగ, మొక్కజొన్న వంటి పంటలను రైతులు అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. అయితే పసుపుకు ఉన్న మార్కెట్ గిరాకీని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులు పసుపు సాగుకు అనుకూలమా అనే అంశాన్ని తెలుసుకునేందుకు మంత్రి ఈ ప్రయోగం చేపట్టారు.
తాజాగా పసుపు దుంపలను పరిశీలించిన మంత్రి, దుంపలు బాగా ఊరడంతో పాటు నాణ్యంగా ఉన్నాయని తెలిపారు. పామాయిల్ తోటల్లో అంతర పంటగా పసుపు సాగు చేస్తే రైతులకు అదనంగా లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశముందని ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది.
రైతులకు భరోసా కల్పించేలా మంత్రి స్వయంగా సాగు చేసి చూపడం పట్ల స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Comments