కాప్రా సర్కిల్ కార్యాలయంలో కార్మికులకు మెగా హెల్త్ క్యాంప్
350 మందికి వైద్య పరీక్షలు
కాప్రా, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు, కార్యాలయ సిబ్బందికి ఉద్దేశించి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో దాదాపు 350 మంది కార్మికులు, సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా ఇండియన్ క్యాన్సర్ సొసైటీ సహకారంతో, కర్కినోస్ హెల్త్ కేర్ – హైదరాబాద్ వారి సౌజన్యంతో సుమారు 150 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
అలాగే లైఫ్ లైన్ తులసి హాస్పిటల్, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వారి సహకారంతో షుగర్, బీపీ, థైరాయిడ్, ఆర్థో వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ జోత్స్న వైద్య సేవలు అందించారు.ఈ కార్యక్రమాన్ని కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, నాచారం డిప్యూటీ కమిషనర్ నిత్యానంద్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీ.ఎం.ఓ.హెచ్ డాక్టర్ పద్మజ, ఏఎంఓహెచ్ డాక్టర్ మమత, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డీఈ కాపురం రవి, డీఈ బాలకృష్ణ, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్తదితరులు పాల్గొన్నారు.పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఇలాంటి హెల్త్ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.


Comments