రేషన్ డీలర్ల డిమాండ్ల పరిష్కారానికి చొరవ తీసుకుంటా
ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, జనవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా హస్తినాపురం డివిజన్ పరిధిలోని కేకే గార్డెన్ ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని రేషన్ డీలర్ల సమస్యలపై మాట్లాడారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 17,200 మంది రేషన్ డీలర్లు పనిచేస్తున్నారని తెలిపారు. దేశ జనాభాలో దాదాపు 85 శాతం కుటుంబాలతో రేషన్ డీలర్లకు నేరుగా సంబంధం ఉంటుందని, అయినప్పటికీ ప్రభుత్వాలు రేషన్ డీలర్ల పట్ల తగిన ప్రాధాన్యం చూపడం లేదని విమర్శించారు.రేషన్ డీలర్లు చేసిన తొమ్మిది డిమాండ్లలో అన్నింటినీ ఒకేసారి నెరవేర్చడం సాధ్యం కాకపోయినా, కనీసం ఐదు నుంచి ఆరు డిమాండ్లను తప్పకుండా అమలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక్క వ్యక్తికి ఐదు కిలోల బియ్యం అందిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క కిలో మాత్రమే ఇస్తోందని పేర్కొన్నారు. రేషన్ డీలర్లకు కమిషన్లు పెంచాలని, నెలసరి విధానంలో జీతాలు చెల్లించే వ్యవస్థను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నైకోటి రాజు, జనరల్ సెక్రటరీ ఆవుల సంజీవ రెడ్డి, కోశాధికారి పారేపల్లి నాగరాజు, నూతనంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం మల్లికార్జున్ గౌడ్, రాష్ట్ర నాయకులు నందయ్య, అమూర ఇంద్రసేన రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోకొండ వైకుంఠం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పుస్తె శ్రీకాంత్, మురళీ మోహన్, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, సామ రంగారెడ్డి, హస్తినాపురం డివిజన్ అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments