ప్రత్యర్థులవి ‘సొల్లు కబుర్లు’.. మావి చేతల పనులు
- *పదేళ్ల దొరల పాలనలో పేదలకు ఒరిగింది శూన్యం*
- *కమిషన్ల కక్కుర్తితో కట్టిన కాళేశ్వరం ఏమైందో చూడండి*
- *ఏదులాపురం ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ పై మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు*
ఖమ్మం బ్యూరో, జనవరి 31(తెలంగాణ ముచ్చట్లు)
"ఎన్నికలు రాగానే ప్రత్యర్థులు మీ ముందుకు వచ్చి ‘సొల్లు కబుర్లు’ చెబుతారు.. మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ, పదేళ్లు అధికారంలో ఉండి పేదవాడికి ఒక ఇల్లు కూడా ఇవ్వని వారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?" అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 25వ వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నికల శంఖారావం పూరించారు.
*
ప్రచార సభల్లో మంత్రి పొంగులేటి పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గత దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆనాటి పాలకులు తమ అకౌంట్లు నింపుకోవాలని చూశారే తప్ప, సామాన్యుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి, కేవలం కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కళ్లముందే కూలిపోతోంది. ఇది వారి అవినీతికి నిదర్శనం కాదా?" అని ప్రశ్నించారు. రెండు సార్లు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను వంచించిన చరిత్ర వారిదని ఎద్దేవా చేశారు.
- *చేతల ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం*
తాము అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మాటను నిలబెట్టుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. "మేము మాటలు చెప్పేవాళ్లం కాదు.. పనిచేసే వాళ్లం. రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు రూ. 5 లక్షల సాయం అందిస్తాం" అని భరోసా ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం, ₹500లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని, ఇవే తమ ప్రభుత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
*ఏదులాపురానికి కొత్త హంగులు*
ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి పునరుద్ఘాటించారు. "వచ్చే వర్షాకాలం నాటికి మున్నేరు రక్షణ గోడను పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తాం. ఎఫ్.సి.ఐ గోడౌన్ తరలింపుతో పాటు ఇక్కడ అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం. మీ కష్టం తెలిసిన మీ పెద్ద కొడుకుగా నేను మీకు అండగా ఉంటా" అని హామీ ఇచ్చారు. విపక్షాల సొల్లు కబుర్లను నమ్మకుండా, అభివృద్ధిని కాంక్షిస్తూ హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.


Comments