ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
కీసర ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు
కీసర, ఫిబ్రవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):
ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆశా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కీసర ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపునిచ్చింది.ఈ మేరకు కీసర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఆశా వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీసును సంబంధిత వైద్య అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన యూనియన్ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ 2025 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.పేదలకు ఉపాధి హామీ కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక–పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ సహా జాతీయ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు.ఆశా వర్కర్లను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా రెగ్యులర్ వర్కర్లుగా గుర్తించాలని, 45వ, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీం కార్మికుల కోసం ప్రత్యేక పే కమిషన్‌ను నియమించాలని, రెగ్యులరైజ్ చేసే వరకు కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలని కోరారు.పని గంటలను 8 గంటలకు పరిమితం చేసి పనిభారాన్ని తగ్గించాలని, ఆశా వర్కర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు కల్పించి హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Comments