కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం.
15వ బెటాలియన్ కమాండెంట్ ఎన్. పెదబాబు.
సత్తుపల్లి, డిసెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
మాజీ కేంద్ర మంత్రి, దివంగత నాయకులు గడ్డం వెంకటస్వామి (కాకా) వర్ధంతిని బి గంగారం గ్రామంలో 15వ బెటాలియన్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ఎన్. పెదబాబు కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కమాండెంట్ ఎన్. పెదబాబు మాట్లాడుతూ, కాకా వెంకటస్వామి కేవలం రాజకీయ నాయకుడే కాకుండా కార్మికులు, నిరుపేదల గొంతుకగా నిలిచిన మహోన్నత వ్యక్తి. సాధారణ కార్మికుడి స్థాయిల నుండి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడం ఆయన జీవితం ప్రత్యేకత అని, నేటి తరం నాయకులు, యువతకు స్ఫూర్తి అని అన్నారు.
పేదలకు గృహాలు కల్పించడం, వేలాది మందికి విద్యను అందించడం వంటి ఆయన సేవలు మరువలేనివని, కార్మికుల హక్కుల కోసం చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని గుర్తు చేశారు. కాకా వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తూ సమాజ సేవలో చురుకుగా పాల్గొనడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని కమాండెంట్ ఎన్. పెదబాబు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఏ. అంజయ్య, అసిస్టెంట్ కమాండెంట్ యస్. శ్రీధర్ రాజా, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్‌ఎస్‌ఐలు మరియు సిబ్బంది పాల్గొని కాకా వెంకటస్వామి కి శ్రద్ధాంజలి ఘటించారు.


Comments