వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడులను ఖండిస్తూ సీపీఎం ర్యాలీ
ఏ ఎస్ రావు నగర్, జనవరి 04 (తెలంగాణ ముచ్చట్లు):
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమెరికా సామ్రాజ్యవాదం వెనిజులాపై అక్రమంగా దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడిని ఆయన సతీమణితో సహా బలవంతంగా బంధించి తీసుకుపోయిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం కమలానగర్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు.కమలానగర్ పార్టీ కార్యాలయం నుంచి కమలానగర్ మెయిన్ రోడ్ వరకు నినాదాలతో ఊరేగింపుగా వెళ్లిన సీపీఎం నాయకులు, అనంతరం అమెరికా సామ్రాజ్యవాద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎం పార్టీ నాయకులు గొడుగు యాదగిరి రావు అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోమటి రవి దిష్టిబొమ్మను తగులబెట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు అమెరికా సామ్రాజ్యవాదం అనేక దేశాలపై దాడులు చేసి తన దుర్మార్గమైన విధానాలను అమలు చేస్తోందన్నారు. తప్పుడు ఆరోపణలతో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను హతమార్చడం, ఇరాన్‌పై దాడి చేసి పరాభవం పాలవడం ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు.వెనిజులాలో అపారమైన చమురు నిల్వలు, ఖనిజ సంపద ఉన్న కారణంగానే ఆ దేశాన్ని ఆక్రమించి తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనే కుట్రలో భాగంగా అధ్యక్షుడు మధురోను బంధించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా సీపీఎం ఖండిస్తోందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.ఇది దేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి విరుద్ధమని పేర్కొన్నారు.వెంటనే భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని, సామ్రాజ్యవాద దురాక్రమణలకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఏకే దుర్గాచార్యులు, పి.బి.చారి, మల్లేష్, శివన్నారాయణ, సీఐటీయూ నాయకులు ఉన్నికృష్ణన్, యువజన నాయకులు శశాంక్ తదితరులు పాల్గొన్నారు.


Comments