బీసీ భవన నిర్మాణానికి అనుమతి.!
ఛలో ఖమ్మంతో ఫలించిన ఐదేళ్ల పోరాటం.
సత్తుపల్లి, జనవరి, 5 (తెలంగాణ ముచ్చట్లు):
బీసీ భవన నిర్మాణం కోసం 2020 నుంచి కొనసాగిన ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం విజయవంతమైంది. మద్దిశెట్టి సామేలు నాయకత్వంలో సాగిన ఉద్యమంలో భాగంగా నిర్వహించిన ఛలో ఖమ్మం కార్యక్రమం నిర్ణాయకంగా మారింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోచారి 2020లో ఇచ్చిన లేఖ ఆధారంగా, కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, సత్తుపల్లి తహసీల్దార్ కలిసి సత్తుపల్లి మండలం అయ్యగారుపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 184/పీ లో ఉన్న ఐదు గుంటల ప్రభుత్వ భూమిని సర్వే చేసి ఖాళీగా ఉన్నట్టు నిర్ధారించారు. ఖాళీ ప్రభుత్వ స్థలం ఉన్నట్టు గుర్తించిన రెవెన్యూ అధికారులు ఈ విషయాన్ని కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ద్వారా జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార దినంలో ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి తరఫున బీసీ భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి పత్రాలను జిల్లా రెవెన్యూ విభాగ అధికారి వద్ద సమర్పించి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం, ఆ స్థలాన్ని బీసీ కార్పొరేషన్‌కు కేటాయించాలని నిర్ణయించింది. భూమి అప్పగింత అనంతరం బీసీ కార్పొరేషన్ ద్వారా భవన నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు అధికారులు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ, ఐదేళ్లుగా నిరంతరంగా సాగిన పోరాటం ఫలితంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. సహకరించిన సత్తుపల్లి
రెవెన్యూ అధికారులు, కల్లూరు ఆర్డీవో, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాస్ గౌడ్, పుట్టపర్తి హరిబాబు, ఈదుల రవి, బానోతు సీను నాయక్, కొంటె కృష్ణ, మచ్చ గిరి, సునీత తదితరులు పాల్గొన్నారు.


Comments