గురుకులాల బలోపేతానికి రూ.10.65 కోట్లు మంజూరు
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ – సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
వనపర్తి, జనవరి5(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గంలోని గురుకుల,ఆశ్రమ,రెసిడెన్షియల్ విద్యాసంస్థల మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ ఫలించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.10.65 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.విద్యార్థులకు మెరుగైన వసతులు,నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని పలు గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల బలోపేతంపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఖిల్లా ఘణపురం మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో డార్మెటరీతో పాటు డైనింగ్ హాల్ నిర్మాణాలకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి.అలాగే వనపర్తి మండలం మర్రికుంటలోని బాలికల గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో డైనింగ్ హాల్,వంట గదుల నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయగా, అదే పాఠశాలలో అధ్యాపక నివాస సముదాయం (స్టాఫ్ క్వార్టర్స్) నిర్మాణానికి మరో రూ.1.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.పెద్దమందడి మండలం బుగ్గపల్లి తాండ–రాజపేట శివారులోని బాలుర గిరిజన గురుకుల పాఠశాలలో డైనింగ్ హాల్‌తో పాటు అధ్యాపక నివాస భవనాల నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.అదేవిధంగా అర్బన్ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహం నిర్మాణానికి రూ.2.65 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.ఈ నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు. నిర్మాణాలు పూర్తయితే వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గురుకుల, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు మరింత బలోపేతం అవుతాయని,విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతి,మెరుగైన విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.


Comments