ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం
దమ్మాయిగూడ, జనవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని సీతారామ నిలయం, పీఎస్ రావు నగర్, అయ్యప్ప కాలనీ, భోజనపల్లి ప్రాంతాల్లో బుధవారం గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.భోజనపల్లి శ్రీనివాసాచార్యులు, సుందరాచార్య స్వామి ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా సాగింది. తొలుత ఎదుర్కోళ్ల ఘట్టాన్ని వైదిక మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కళ్యాణ సమయంలో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.దమ్మాయిగూడ, చీర్యాల, కీసర ప్రాంతాలతో పాటు పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి మరింత వైభవాన్ని చేకూర్చారు.ఈ సందర్భంగా సుందరాచార్య స్వామి మాట్లాడుతూ ధనుర్మాసం భక్తి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. ఈ మాసంలో గోదాదేవి రంగనాథ స్వామిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో నిర్వహించే పూజలు భక్తుల కోరికలను నెరవేర్చుతాయని పేర్కొన్నారు. గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ దర్శనం వల్ల కుటుంబాల్లో శాంతి, సుఖసంతోషాలు నెలకొంటాయని, సమాజంలో ధార్మిక భావనలు మరింత బలపడతాయని అన్నారు.ప్రతి ఒక్కరూ ధనుర్మాస ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.


Comments