మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు
మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను ప్రజావాణి ఆవరణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు సరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ గౌరవంతో జీవించడం, విద్యను పొందడం, రక్షణ కలగడం వంటి ప్రాథమిక హక్కులు ప్రతి చిన్నారికి చెందుతాయని చెప్పారు. ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసం, ఆనందం, సమానత్వం పెంపొందే సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని ఆమె ముఖ్యంగా పేర్కొన్నారు.అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ సమాజంలో ప్రతి చిన్నారి ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా ఎదగేందుకు మంచి వాతావరణం, సమానత్వం ఎంతో అవసరమని చెప్పారు. బాలల హక్కులను కాపాడడం అందరి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.సిడబ్ల్యుసి చైర్‌పర్సన్ రాజారెడ్డి మాట్లాడుతూ చిన్నారులందరికీ విద్య హక్కు కలిగి ఉందని, ప్రతి పిల్లవాడు విద్యను పొందేలా సమాజం కృషి చేయాలని సూచించారు.జిల్లా సంక్షేమ అధికారి శారద మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘనను గమనించిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. పిల్లలు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని, విద్య ద్వారానే భవిష్యత్తును నిర్మించుకోవచ్చని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిఎం & హెచ్‌ఓ, జిల్లా విద్యాశాఖ అధికారులు, డిపిఆర్ఓ మేడ్చల్–మల్కాజిగిరి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు అర్చన, నాగ జయశ్రీ, రామ్మోహన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఇంతియాజ్ రహీం, జిల్లా బాలల సంరక్షణ విభాగ సిబ్బంది, నిర్వాహకులు,పిల్లలు పాల్గొన్నారు. 



Comments