సన్నబియ్యం పంపిణీ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయాలలి
కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి సిఫారసు
హైదరాబాద్, (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని, ఈ సంక్షేమ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల ద్వారా నేరుగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.
సన్న బియ్యం పంపిణీ వల్ల పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలు నేరుగా వంటకు ఉపయోగించే బియ్యం అందడం వల్ల పథకం లక్ష్యం సాధ్యమైందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసే అంశంపై సమగ్ర అధ్యయనం చేస్తామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
హైదరాబాద్ పర్యటన సందర్భంగా మంత్రి ప్రహ్లాద్ జోషి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సివిల్ సప్లయిస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టీఫెన్ రవీంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను సీఎం ప్రస్తావించారు. ఇందులో భాగంగా—
✳️ రబీ 2024–25 కోసం అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా మంజూరు చేయాలి.
✳️ పీడీఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్‌కు సంబంధించిన రూ.1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలి.
✳️ పీఎంజీకేఏవై అయిదో దశకు పెండింగ్‌లో ఉన్న రూ.343.27 కోట్ల సబ్సిడీ వెంటనే చెల్లించాలి.
✳️ ఖరీఫ్ 2024–25 కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవధి పొడిగించాలి.
✳️ ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ సమస్యలు తగ్గించేందుకు అదనపు బాయిల్డ్ రైస్ రేకులు కేటాయించాలి.
✳️ రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు గోదాం సామర్థ్యం ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి.
✳️ 2025–26 ఖరీఫ్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా నేపథ్యంలో, కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలి.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో, మిల్లింగ్‌కు అనువైన ముడి బియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రానికి సూచించారు. మిగులు ధాన్యం సక్రమ నిర్వహణ కోసం ఎగుమతి అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాల్సిన అవసరం ఉందని, బాయిల్డ్ రైస్ అదనపు కోటాను కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. రా రైస్‌కు అనువైన రకాల వరిసాగు కోసం రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.


Comments