డిగ్రీ విద్యార్థులకు యూనిఫార్ములు, నోట్‌బుక్స్ పంపిణీ.
సత్తుపల్లి, ఆగస్టు 22(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి పట్టణంలోని జెవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఆశా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత యూనిఫార్ములు, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. గోపి అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా పాల్గొన్న సత్తుపల్లి శాసన సభ్యురాలు డా. మట్టా రాఘమయి, సిపిడిసి సభ్యులు డా. మట్టా దయానంద్ విజయకుమార్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు యూనిఫార్ములు, నోట్‌బుక్స్, ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే డా. రాఘమయి మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 2000 మంది జూనియర్, డిగ్రీ విద్యార్థులకు యూనిఫార్ములు, నోట్‌బుక్స్ ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చదువులో రాణించేందుకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ప్రతిభతో కళాశాల పేరు ప్రతిష్టలను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
డా. దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ తాము చదువుకున్న రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ తరం విద్యార్థులు ఎదుర్కోకూడదన్న ధ్యేయంతో విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ షేక్ పీర్ సాహెబ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments