ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు.
చెల్లిని కోల్పోయిన రిషికా కన్నీటి ముద్ద.
సత్తుపల్లి, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు):
మండలంలోని చిన్నపాకల గూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు వేసి చిన్నారి ప్రాణాలు బలిగొన్న సంఘటన అందరినీ కలచివేసింది.
బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన గౌర గోపి (28), మౌనిక (25) దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు రిషికా (8), లోహిత (5)తో కలిసి ఇంట్లో నేలపై నిద్రిస్తుండగా, గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కట్ల పాము (విషసర్పం) ఇంట్లోకి చొరబడి చిన్నారి లోహితతో పాటు తల్లి మౌనికను కాటు వేసింది.
సమయం వృథా చేయకుండా కుటుంబ సభ్యులు పామును చంపి, బాధితులను 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ చిన్నారి లోహిత (5) మృతి చెందింది. పరిస్థితి విషమంగా మారిన తల్లి మౌనికను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. లోహిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో ఉంచారు
ఈ ఘటనతో అక్క రిషికా (8) చెల్లిని కోల్పోయి కన్నీటి ముద్దయింది. గ్రామమంతా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు లోహిత మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Comments