జేవిఆర్ కళాశాలలో ఎన్సిసి కాడెట్స్ ఎంపిక.
సత్తుపల్లి, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి జేవిఆర్ ప్రభుత్వ కళాశాలలో ఈ రోజు ఎన్సిసి ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మొత్తం 80 మంది విద్యార్థులు శారీరక పరీక్ష, రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో పాల్గొని ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు.
కార్యక్రమంలో కల్నల్ ఎస్కే భద్ర, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కల్నల్ నవీన్ యాదవ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. గోపి, ఎన్సిసి కేర్ టేకర్ రవికుమార్, రెహమాన్ తో పాటు కాడెట్స్ పాల్గొన్నారు.
విద్యార్థులను ఉద్దేశించి కల్నల్ ఎస్కే భద్ర మాట్లాడుతూ ఎన్సిసి కేవలం శిక్షణ మాత్రమే కాకుండా జీవితాన్ని మలిచే గొప్ప అవకాశం అని అన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ధైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతా భావం ఎన్సిసి ద్వారా పొందవచ్చని, భవిష్యత్తులో సైన్యంలోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఈ అనుభవం బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయాలన్న తపన ఉన్న ప్రతి యువకుడికి ఎన్సిసి ఒక స్వర్ణావకాశమని అన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. గోపి మాట్లాడుతూ విద్యార్థులు ఎన్సిసి పట్ల చూపుతున్న ఉత్సాహం ప్రశంసనీయం అని అన్నారు. ఎన్సిసి విద్యార్థుల్లో దేశభక్తి, స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే అద్భుత వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.


Comments