ధూప దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
నాచారం, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామీణ ప్రాంత ధూప దీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వినిపిస్తోంది. తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం హబ్సిగూడలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్ గంగ ఉపేంద్ర శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
"ప్రతి అర్చకుడు స్వతంత్రంగా ఎదగాలని, బీసీ వర్గాలకు అర్చక సంఘాల్లో పెద్దపీట వేశామని" ఉపేంద్ర శర్మ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అర్చకుల పోరాటాల ఫలితంగానే ధూప దీప నైవేద్యం పథకం అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. ప్రారంభంలో 3,600 ఆలయాలకు ఈ పథకం వర్తించగా, అర్చకుల వేతనాలు రూ.2,500 నుంచి రూ.6,000, ఆ తర్వాత రూ.10,000 వరకు పెరగడం ఉద్యమ విజయమని వివరించారు.
అర్చకులకు ఇన్సూరెన్స్ పథకం తీసుకురావడంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బ్రాహ్మణుల ఆత్మగౌరవం కోసం, చిన్న అర్చకుల సంక్షేమం కోసం సమాఖ్య పలు పోరాటాలు నిర్వహించిందని చెప్పారు. ఆలయ ఆదాయాన్ని పెంచే దిశగా అర్చకులూ కృషి చేయాలని, సహేతుకమైన డిమాండ్లతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ధూప దీప నైవేద్యం పథకంలో డబ్బులు వసూలు చేయడం సరికాదని హెచ్చరించారు.
అర్చకుల హక్కులు, సంక్షేమం, ఆలయాల అభివృద్ధిపై ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీనివాస్ చార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ శర్మ, డిడిఎన్ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పెరంబుడూరి శ్రీకాంత్ స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ పెన్నా మోహన్ శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శటగోపం శ్రీనివాస్ చార్యులు, ఏడబ్ల్యూఎఫ్ సభ్యుడు జక్కాపురం నారాయణ, పూర్వ అధ్యక్షుడు శ్రీనివాస్ సుదర్శన్, సలహాదారు శ్రీకోటి జలందర్ తదితరులు పాల్గొన్నారు.


Comments