జాతీయ రహదారి-163లో పెండింగ్ లో ఉన్న సర్వీస్ రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలి
కేంద్ర మంత్రిని కోరిన వరంగల్ ఎంపీ కడియం కావ్య
న్యూఢిల్లీ,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి 163 (హైదరాబాద్–భూపాలపట్నం రోడ్) లో పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
నేషనల్ హైవేను నాలుగు లైన్లుగా విస్తరించినప్పటికీ, నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, స్టేషన్ ఘనపూర్, చిన్నపెండ్యాల్, కరుణాపురం గ్రామాల వద్ద సర్వీస్ రోడ్ల అనుసంధానం లేకపోవడం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నట్లు ఎంపీ వివరించారు.
లింక్ రోడ్లు లేకపోవడంతో గ్రామాల వాహనాలు నేరుగా ప్రధాన హైవేపైకి రావాల్సి రావడం రద్దీ, ప్రమాదాలకు దారితీస్తోందని తెలిపారు.నాలుగు లైన్ల విస్తరణ సమయంలోనే అవసరమైన భూమి సేకరణ పూర్తయిందని, ఇప్పుడు కేవలం నిర్మాణ పనులు మిగిలి ఉన్నాయని ఎంపీ పేర్కొన్నారు. అందువల్ల వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా ఎంపీ విజ్ఞప్తిని సానుకూలంగా స్వీకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సమస్యను పరిశీలించి అవసరమైన సూచనలు సంబంధిత అధికారులకు ఇస్తామని హామీ ఇచ్చారని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.


Comments