చైతన్య భూమి ప్రాంగణంలో బీసీ రిజర్వేషన్ల సాధన వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కీసర, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలోని చైతన్య భూమి ప్రాంగణంలో వారవారీ జ్ఞానమాల కార్యక్రమం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 181వ పూలమాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కమిటీ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సానాది సాయిబాబ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించారు.
తరువాత మాజి కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాట రాజుతో కలిసి బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఐకాస రాష్ట్ర కమిటీ రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సాయిబాబకు పూలమాలతో, శాలువాతో ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఐకాస కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం పాదయాత్రలు, రథయాత్రలు, సభల ద్వారా చైతన్యం కల్పిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలంతా ఏకతాటిపైకి వచ్చి రిజర్వేషన్ల సాధనకు బలంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్, మోత రాజేంద్రప్రసాద్, తాడేపల్లి అబ్బులు, తగిలే రాధాకృష్ణ, కోలాటి రాజు, చెన్నయ్య, వెంకటేశ్వర్ రావు, పాడుగుల చంద్రమౌళి, కె.వి.రావు, జయమయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.


Comments