వినాయక విగ్రహాల తరలింపులో విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండండి
పెద్దమందడి మండల విద్యుత్ అధికారి సుధాకర్ సూచన
పెద్దమందడి, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ విగ్రహాల తరలింపు, మండపాల వద్ద విద్యుత్ భద్రత పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దమందడి మండల విద్యుత్ అధికారి సుధాకర్ సూచించారు.
ఆయన మాట్లాడుతూ, ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా విగ్రహాల తరలింపు మమ్మురంగా జరుగనుందని, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. విగ్రహాల ర్యాలీల మార్గాల్లో విద్యుత్ లైన్లకు ఆటంకం లేకుండా ముందస్తు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
మండప నిర్వాహకులు, భక్తులు తప్పనిసరిగా భద్రతా చర్యలు పాటించాలని ఆయన సూచించారు. విగ్రహాల ఎత్తును బట్టి రూట్లు నిర్ణయించుకోవాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని చెప్పారు.
విద్యుత్ లైన్లకు కనీసం 2–3 అడుగుల దూరం పాటించాలని, మెటల్ ఫ్రేమ్ డెకరేషన్లను వీలైనంతవరకు తగ్గించాలని సూచించారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్ కోసం స్థానికులు స్తంభాలు ఎక్కరాదని, కేవలం విద్యుత్ శాఖ సిబ్బందే కనెక్షన్లు ఇవ్వగలరని స్పష్టం చేశారు.


Comments