కాలి దప్పి మాట్లాడుతున్న కడియం
మాజీ ఎమ్మెల్యే రాజయ్య
రైతుల కోసం యూరియా లేదు – ప్రజల కోసం అభివృద్ధి లేదు
స్టేషన్ ఘనపూర్ ఆగస్టు/26 (తెలంగాణ ముచ్చట్లు)
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆయన వారసుడు రాజకీయ ప్రయాణంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. “అభివృద్ధి అనే నెపంతో పార్టీలు మారడమే తప్ప ఘనపూర్‌లో ఎలాంటి మార్పు కనిపించడంలేదు” అని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలతో మరోసారి కడియం రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. “తండ్రి–బిడ్డ జంపులకే ప్రాధాన్యం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కడియం మార్క్ ఎక్కడా కనబడలేదు. కనీసం నియోజకవర్గానికి వెయ్యి కోట్లు తేల్చలేని అసమర్థుడు కడియం శ్రీహరి” అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఒకప్పుడు చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకలో చేరిన కడియం, ఇప్పుడు కేసీఆర్‌కే వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డి సన్నిహితుల్లో చేరాడనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. “తనను నమ్మిన వారికే వెన్నుపోటు పొడవడం కడియం పని” అని విమర్శకులు మండిపడుతున్నారు.
బిర్లా ఐలయ్య 1560 కోట్లు, నాయిని రాజేందర్ రెడ్డి 6000 కోట్లు తెచ్చి చూపించగా, కడియం శ్రీహరి మాత్రం కనీసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు కూడా ఘనపూర్‌కు తేల్చలేకపోయాడనే ఆరోపణలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న – “దశాబ్దాలుగా కడియం మార్క్ అంటే ఏంటి? మాకు రోడ్లు, నీరు, ఉపాధి ఎక్కడ ఉన్నాయి?”
విమర్శకులు వ్యంగ్యంగా “75 ఏళ్లు దాటాడు కాబట్టి కాలి తప్పి కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు, మాటలే తప్ప పనులు లేవు” అని ఎద్దేవా చేస్తున్నారు.
యూరియా కోసం రైతుల పడి కాపులు – నాయకులు, అధికారులు ఎక్కడ?

వరి నాట్లు జోరందుకున్న ఈ సమయంలో రైతులకు అత్యవసరమైన యూరియా ఎరువులే అందకపోవడం ఆగ్రహానికి గురి చేస్తోంది. తెల్లవారుజాము నుంచే ఎరువుల డిపోల ఎదుట క్యూల్లో నిలబడి, వర్షంలో తడుస్తూ సాయంత్రం వరకు ఎదురుచూడాల్సిన దుస్థితి.
“ప్రభుత్వం మాపై జాలి లేకపోవడమే స్పష్టంగా కనిపిస్తోంది. నాటు వేసే వరకు రాత్రింబవళ్లు కష్టపడి పొలాలను సిద్ధం చేసుకున్నాం. ఇప్పుడు ఒక్క యూరియా సంచి కోసం వర్షంలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇది మాకెంత అవమానకరమో ఎవరూ పట్టించుకోవడంలేదు” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఫోటోలు దిగడానికే నాయకులు ముందుంటారు, కానీ రైతుల సమస్యలు తీర్చడంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. అధికారులు కూడా నోరు మూసుకుని కూర్చున్నారు” అని రైతులు మండిపడుతున్నారు.
ఎరువులు అందకపోతే పంటలు నాశనం కావడం ఖాయం అని, ఆ నష్టాన్ని ఎవరు భరించాలనే ప్రశ్నను రైతులు నేరుగా ప్రభుత్వానికి విసురుతున్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, పార్శి రంగన్న, మాజీ సర్పంచ్ తాటికొండ సురేష్, మారేపల్లి ప్రసాద్, చేపూరి గణేష్, గుండె మల్లేష్, చింత శ్రీనివాస్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


Comments