ఇంటింటికి ఇందిరమ్మ చీర 

ఇంటింటికి ఇందిరమ్మ చీర 

 

-ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం పారదర్శకంగా జరగాలి

-స్వయం సహాయక బృందాల్లో లేని మహిళలకు వెంటనే సభ్యత్వం ఇచ్చి చీరలు అందించాలి

-గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చీరల పంపిణీ సెర్ప్ యాప్‌లో తప్పనిసరిగా నమోదులు

-రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ పంపిణీ

—గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకూ కార్యక్రమం


-నియోజకవర్గాలు, మండలాల్లో ప్రారంభ కార్యక్రమాలతో బృందాల ప్రాముఖ్యత చాటాలని ఆదేశాలు 

-మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)

హైదరాబాద్,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని సంపూర్ణ క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెర్ప్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, కార్యక్రమం అమలులో ఏవిధమైన లోపాలు ఉండకూడదని సూచించారు.

మహిళల గౌరవం, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ మహత్తర సంక్షేమ పథకాన్ని ప్రారంభించిందని సీతక్క తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందేలా పంపిణీని ఖచ్చితంగా నిర్వహించాలని ఆమె సూచించారు.

స్వయం సహాయక బృందాల్లో ఇంకా సభ్యత్వం లేని మహిళలకు అవగాహన కల్పించి, వెంటనే సభ్యత్వం ఇచ్చి చీరలను అక్కడికక్కడే అందించాలన్నారు. కొత్త లబ్ధిదారుల గుర్తింపులో పౌర సరఫరాల శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత లబ్ధిదారులు, కొత్తగా చేరిన వారి వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన SERP ప్రొఫైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు.

పంపిణీ కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహిస్తున్నట్లు సీతక్క పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకూ మొదటి దశ, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 9 వరకూ రెండో దశగా అమలు చేయాలని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రతి నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ లేదా ఆర్‌డిఓ స్థాయి అధికారిని ప్రత్యేక పర్యవేక్షకులుగా నియమించాలని జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాల ప్రాముఖ్యతను, ఇందిరమ్మ మహిళా శక్తి విజయాలను ప్రతిబింబించే విధంగా నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు సాగాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులను మండల స్థాయి కార్యక్రమాలకు ఆహ్వానించాలని సూచించారు.

గ్రామాల స్థాయిలో ప్రభుత్వ సిబ్బంది, స్వయం సహాయక బృందాల సభ్యులు కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చీరలను బొట్టుపెట్టి అందించడం ద్వారా ఇంటింటా పండుగ వాతావరణం నెలకొల్పాలని సీతక్క పేర్కొన్నారు. మహిళల ఐక్యతను ప్రతిబింబించేలా ఇంటింటికీ ఇందిరమ్మ చీరలు చేరే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు.

సెర్ప్ యాప్‌లో ఆధార్ డేటా, ఫోటోలు తదితర వివరాల నమోదు అవసరమవుతున్నందున అధికారులు సంపూర్ణ సన్నద్ధతతో పనిచేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ పథకాన్ని మహిళల జీవితాల్లో ప్రత్యేకమైన పండుగలా మార్చాలని సీతక్క ఆదేశించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్