స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో పేపర్ బాయ్ టు ఎడిటర్ పుస్తక పరిచయం
ఏ ఎస్ రావు నగర్, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్. వినయ్ కుమార్ రచించిన “పేపర్ బాయ్ టు ఎడిటర్” పుస్తక పరిచయ సభ శుక్రవారం రాత్రి కమలానగర్ సిఐటియు కార్యాలయం హాల్లో జరిగింది. కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.సభ ప్రారంభంలో రచయిత వినయ్‌కుమార్ జీవిత ప్రయాణం, జర్నలిస్టు ప్రస్థానంపై రూపొందించిన బయోగ్రఫీ వీడియోను ప్రదర్శించారు. అనంతరం స్ఫూర్తి గ్రూప్ నాయకులు శివన్నారాయణ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు.పుస్తక పరిచయం రిటైర్డ్ ప్రిన్సిపల్ పద్మావతి చేశారు. వినయ్‌కుమార్ చిన్ననాటి కష్టాలు, ఎదుర్కొన్న సామాజిక వివక్షలు, చదువుపై చూపిన పట్టుదల, ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ అభ్యుదయ భావాలు అలవర్చుకున్న తీరు వివరించారు. ఆయన ఈనాడు, ప్రజాశక్తి పత్రికల్లో వివిధ హోదాలలో పనిచేసి చివరకు ఎడిటర్‌గా పదవీ విరమణ చేసిన విషయాన్ని పేర్కొన్నారు.ప్రముఖ జర్నలిస్టు కంబాలపల్లి కృష్ణ మాట్లాడుతూ వినయ్‌కుమార్ వ్యక్తిత్వం నేటి యువతకు ఆదర్శమని అన్నారు.ముఖ్య అతిథి బీఎస్ రాములు (బీసీ కమిషన్ మాజీ అధ్యక్షులు) మాట్లాడుతూ వినయ్‌కుమార్ ప్రతి పనిలోనూ నిబద్ధత చాటారని, ఆయన రచన అప్పటి సామాజిక–రాజకీయ వాస్తవాలను స్పష్టంగా ప్రతిబింబించిందని అన్నారు. వినయ్‌కుమార్ అభ్యుదయ ప్రస్థానంలో సీపీఎం దార్శనికత గొప్ప పాత్ర పోషించిందని అభిప్రాయ పడ్డారు.టీపీఎస్కే అధ్యక్షులు జి. రాములు మాట్లాడుతూ వినయ్ కుమార్ జీవితం అనేక కవులు, రచయితలు, విలేకరులకు ప్రేరణనిస్తుందని తెలిపారు.రచయిత వినయ్‌కుమార్ మాట్లాడుతూ తన తండ్రి, జీవిత భాగస్వామి సుజావతి సహకారం వల్లే తన ప్రయాణం సాఫల్యవంతమైందని చెప్పారు. ఈనాడు పత్రికలో తన కథనాలను రామోజీరావు ప్రశంసించిన సందర్భాలు, మన్మోహన్ సింగ్‌తో అమెరికా పర్యటన చేసిన అనుభవాలు గుర్తుచేశారు. ప్రస్తుతం సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శిగా ప్రజా సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు.సభ అధ్యక్షుడు యాదగిరిరావు మాట్లాడుతూ సుజావతి సాంస్కృతిక రంగానికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని అన్నారు. నవంబర్ 29న మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా వినయ్‌కుమార్ తెలుగు టైటిల్స్ రాసిన ఫూలే చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో అతిథులకు చేనేత వస్త్రాలతో సన్మానించారు. బీఎస్ రాములు, వినయ్‌కుమార్, పద్మావతి, సుజావతిని స్ఫూర్తి గ్రూప్ నాయకులు ఘనంగా గౌరవించారు. అనంతరం కర్రే మల్లేశం పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, వెంకటసుబ్బయ్య, శారద, రోజా రాణి, హరిప్రసాద్, మల్లేశం, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు
.


Comments