కందుగులలో జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా ప్రారంభం.
హుజూరాబాద్, జూన్ 3(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో గ్రామసభ, ర్యాలీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ, ప్రతి చిన్నారి పాఠశాలకు హాజరై నాణ్యమైన విద్యను పొందేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు, ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “ప్రతి బిడ్డ బడికి – ప్రతి గ్రామం విద్యావంతం” అనే నినాదాలతో గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో విద్య పట్ల చైతన్యం కల్పించారు.
ఈ సందర్భంగా విద్యాప్రేమికుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్య పాఠశాలల్లో చేర్పించి, వారి విద్యాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం మెరుగైన వసతులు, నైపుణ్య ఆధారిత విద్య, డిజిటల్ బోధన అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యా వికాసం ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి విద్యార్థి చదువులో రాణించేలా అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


Comments