డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు ‘ఉమెన్ ఆఫ్ ఎక్సలెంట్’ అవార్డు
ఖమ్మం బ్యూరో,మార్చి 08,(తెలంగాణ ముచ్చట్లు)
చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన డాక్టర్ లక్ష్మీకాంతమ్మ కు హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో మార్చి 8న నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు “ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ” ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరై డాక్టర్ లక్ష్మీకాంతమ్మకు అవార్డు అందజేశారు. ప్రత్యేక అతిథిగా ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రొయ్యూరు శేషసాయి పాల్గొన్నారు. సభకు కళారత్న డాక్టర్ చిలుముల బాల్‌రెడ్డి (పుడమి సాహితీ వేదిక ఫౌండర్ డైరెక్టర్) అధ్యక్షత వహించగా, నేషనల్ చైర్మన్ ఎన్ఐడిసి ఆఫ్ ఈస్ట్ ఇండియా అగర్‌వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ యామినేని ఉప్పలరావు, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ధరావత్ బాల్స్ నాయక్ (నల్గొండ జిల్లా), విద్యా విశ్లేషకుడు మరియు గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ బాలరాజు ముద్దాడ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని తెలిపారు. సృష్టికి జీవం పోసింది మహిళేనని, ఒక తల్లిగా, భార్యగా, బిడ్డగా, అక్కగా, చెల్లిగా అనేక పాత్రలు పోషిస్తున్న మహిళలను సమాజంలో చిన్నచూపు చూడకుండా గౌరవించాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మహిళల విలువలను తెలియజేస్తూ ఒక చైతన్య గీతం ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ మహిళలు సృష్టికి ఆధారం అని అన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కుటుంబం, వ్యవసాయం, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో మహిళలు కష్టపడుతున్నారని, సమాజంలో మహిళలను గౌరవించడం మన సంస్కృతి అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ అవార్డు అందుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మీకాంతమ్మ తెలిపారు.
మహిళలను గౌరవిద్దాం, వారిని కాపాడుదాం అనే సందేశాన్ని ఈ వేదిక ద్వారా అందించారు.


Comments