పర్యావరణానికి అనుకూలంగా హోలీ వేడుకలు జరుపుకుందాం
వనపర్తి,మార్చి2(తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన హోలీ పండుగను ఈసారి పర్యావరణానికి అనుకూలంగా, సురక్షితంగా జరుపుకోవాలని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు.వసంత ఋతువు ఆగమనాన్ని సూచించే రంగుల పండుగ హోలీ, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.హోలీ పండుగ వెనుక ఉన్న పౌరాణిక గాథల్లో ప్రముఖమైనది ప్రహ్లాదుడు–హోలిక దహనం కథ. హిరణ్యకశిపుడు తనను దేవుడిగా భావించి, విష్ణుభక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుడిని హింసించాడని పురాణాలు చెబుతున్నాయి. అగ్నిలో కాలకూడదనే వరం పొందిన హోలిక, ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో ప్రవేశించగా, విష్ణుమూర్తి కటాక్షంతో ప్రహ్లాదుడు రక్షించబడి, హోలిక దహనమైంది. దీనికి గుర్తుగా హోలీ పండుగకు ముందు రోజు హోలికా దహనం నిర్వహించే ఆచారం కొనసాగుతోంది.అలాగే రాధా–కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా రంగుల పండుగ ఆవిర్భవించిందని విశ్వాసం ఉంది. చిన్ననాటి శ్రీకృష్ణుడు తన నీలి వర్ణం గురించి ఆలోచించగా, తల్లి యశోద సూచనతో రాధ ముఖానికి రంగు పూయడం ద్వారా రంగుల సంబరాలకు శ్రీకారం చుట్టినట్లు పురాణ గాథలు తెలియజేస్తున్నాయి.శీతాకాలం ముగిసి వసంత ఋతువు ఆగమనాన్ని ఆహ్వానిస్తూ, చీకటి నుంచి వెలుగుకు మార్పును సూచిస్తూ హోలీని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని కామ దహనం అని కూడా పిలుస్తారు.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పండుగను ఆనందంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు.రసాయన రంగులను ఉపయోగించకుండా సహజ వనరులతో తయారు చేసిన రంగులను వినియోగించాలని అన్నారు. పువ్వులతో తయారు చేసిన రంగులు ఆరోగ్యానికి హానికరం కాదని తెలిపారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని కోరారు.రంగుల స్థానంలో గుడ్లు వంటి అపరిశుభ్ర పదార్థాలను వినియోగించడం మానుకోవాలని, రంగులు చల్లేటప్పుడు కళ్లలోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.హోలీ పండుగను కుల, మత భేదాలకు అతీతంగా జరుపుకొని భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటుదామని పిలుపునిచ్చారు.రంగుల పండుగ మన జీవితాల్లో ఆనందం, స్నేహం, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.


Comments