తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ జయంతి
ఏ ఎస్ రావు నగర్, ఫిబ్రవరి 19 (తెలంగాణ ముచ్చట్లు):
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గురువారం కమలానగర్ కార్యాలయంలో సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు. శివాజీ చిత్రపటానికి తెలుగు పండిట్ లక్ష్మయ్య, యువజన నాయకుడు శశాంక్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడని కొనియాడారు. మొగులులకు వ్యతిరేకంగా పోరాడి సామ్రాజ్యాన్ని నిర్మించారని పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేసిన పరిపాలకుడిగా ఆయన నిలిచారని తెలిపారు.అట్టడుగు వర్గాలకు సైన్యంలో అవకాశాలు కల్పించడంతో పాటు ముస్లింలను కూడా సైన్యాధికారులుగా నియమించుకున్నారని గుర్తుచేశారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించిన శాసకుడిగా చరిత్రలో నిలిచారని అన్నారు.శివాజీ చరిత్రను సాధికారంగా అధ్యయనం చేసి వెలుగులోకి తెచ్చిన మహనీయుల్లో జ్యోతిరావు పూలే ప్రముఖులని తెలిపారు.అనంతరం బి.ఆర్. అంబేద్కర్ కూడా శివాజీ జయంతి ఉత్సవాలను కొనసాగించారని పేర్కొన్నారు.సామాజిక ఉద్యమ నేత జయరాజు మాట్లాడుతూ నేటి సమాజంలో మత విద్వేషాలను ప్రోత్సహించడం దుర్మార్గమని, ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. తెలుగు పండితులు లక్ష్మయ్య, రుక్కయ్య, ఎం.భాస్కర్ రావు, రవి తదితరులు ప్రసంగిస్తూ శివాజీ చూపిన మార్గంలో మతసామరస్యాన్ని కాపాడుకోవాలని కోరారు.అనంతరం సభ్యులు శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, గౌసియా, అంజలి, ఉమామహేశ్వరరావు, నవతెలంగాణ రవి, వెంకటేశ్వరరావు, మహేష్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.


Comments