పట్టుదలతో దివ్యాంగులు అన్ని రంగాలలో రాణించాలి......
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి -16(తెలంగాణ ముచ్చట్లు)
పట్టుదలతో ముందడుగు వేసి దివ్యాంగ విద్యార్థులు అన్ని క్రీడా విభాగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. దివ్యాంగ చిన్నారుల రాష్ట్రస్థాయి ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నుండి వివిధ క్రీడా విభాగాలలో ఎంపికైన దివ్యాంగ విద్యార్థుల బృందానికి సోమవారం కలెక్టర్ లో జిల్లా కలెక్టర్ అభినందించారు. వారి బస్సు ప్రయాణానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి క్రీడా పోటీలు దోహదపడతాయని, ఎందులోను మేము ఎవరికి తక్కువ కాదని, ఎల్లప్పుడూ అన్ని రకాల ఆటల పోటీలలో పాల్గొంటూ ఉండాలని అన్నారు. హైదరాబాదులో జరుగుతున్న రాష్ట్రస్థాయి దివ్యాంగ చిన్నారుల ఆటల పోటీలకు ఖమ్మం జిల్లా తరుపున అండర్14, అండర్ 16 విభాగంలో 20 మంది వివిధ పోటీలకు హాజరవుతున్నారని తెలిపారు.
రాష్ట్ర స్థాయిలో మానసిక వైకల్యం, అంధత్వం, బధిరత్వం, శారీరక అంగవైకల్యం మొదలగు కేటగిరీలలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహిస్తారని వివరించారు. జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ బాజోజు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగ చిన్నారుల బృందానికి సహాయకులుగా ఐదుగురు ఐఆర్పిలు, ఇద్దరూ స్పెషల్ ఎడ్యుకేటర్లు, ఇద్దరు కేర్ గివర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్ళుతున్నారని వెల్లడించారు. క్రీడా పోటీలలో పథకాలు సాధించి విజేతలుగా నిలవాలని, ఖమ్మం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్దులకు కలెక్టర్ మనోధైర్యం కల్పించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి భవిష్యత్తులో మరింత మంచి నైపుణ్యాన్ని కనబర్చి కష్టపడి ఆడితే క్రీడల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. క్రీడలతో పాటు విద్యలో రాణించాలని, పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడ ముఖ్యమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, ఇన్చార్జి డిఈవో శ్రీనివాసరావు, ఎఎస్సి భాను ప్రకాష్, డిఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments