మహాశివరాత్రి వేళ కీసరగుట్టలో లక్షలాది భక్తుల సందడి
స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
కీసర, ఫిబ్రవరి 15 (తెలంగాణ ముచ్చట్లు):
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున నుంచే రాష్ట్ర నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సతీ సమేతంగా స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పాలు, పండ్లు, పూలు, ధూపదీప నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని వేడుకున్నారు. ఆలయ పరిసరాలు “ఓం నమఃశివాయ”, “హరహర మహాదేవ” నినాదాలతో మారుమ్రోగాయి.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, అన్నప్రసాదం, వైద్య శిబిరాలు, పార్కింగ్, రవాణా సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.మహాశివరాత్రి వేళ కీసరగుట్ట కేసరిగిరి కొండలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతూ భక్తి పరవశాన్ని చాటిచెప్పాయి.



Comments