ఘనంగా దేవాలయ కళ్యాణ మండపం ప్రారంభం.!
- ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల.
- దాతగా దాసరి వెంకటరామిరెడ్డి(చిట్టి నాయన).
సత్తుపల్లి, ఫిబ్రవరి 14 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండలంలోని బి గంగారం గ్రామం 15వ బెటాలియన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబడిన దేవాలయ కళ్యాణ మండపాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రిని కమాండెంట్ ఏ. అంజయ్య పుష్పగుచ్ఛంతో సాదరంగా ఆహ్వానించారు.
మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించి కళ్యాణ మండపాన్ని అధికారికంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. మండపాన్ని పూలతో అందంగా అలంకరించారు.
ఈ కళ్యాణ వేదిక నిర్మాణానికి దాతగా గంగారం గ్రామం దాసరి వెంకటరామిరెడ్డి (చిట్టి నాయన) మరియు ఆయన కుమారుడు దాసరి మధుమోహన్ రెడ్డి విశేష సహకారం అందించారు. వారి ఉదార సహకారంతో నిర్మించబడిన ఈ వేదిక బెటాలియన్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల శుభకార్యాలు, వివాహాలు మరియు ఇతర సామాజిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడనుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజ సేవాభావంతో ముందుకు వచ్చి ఇలాంటి శ్రేయోభిలాషి కార్యక్రమాలకు సహకరించిన దాతలను అభినందించారు. సిబ్బంది సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ఈ వేదిక భవిష్యత్తులో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ బి. వేణుగోపాల్ రెడ్డి, ఆర్.ఐలు రామ సత్యనారాయణ, ఉదయ్ కుమార్, ఆర్.ఎస్.ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు. దాతలను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. 



Comments