4 లేబర్ కోడ్ల రద్దు కోరుతూ మల్కాజిగిరిలో సార్వత్రిక సమ్మె ర్యాలీ
మల్కాజిగిరి, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 12 ఫిబ్రవరి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మల్కాజిగిరిలో సిఐటియు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలతో ర్యాలీ చేపట్టారు.ఈ ర్యాలీ ఆనంద్‌బాగ్‌లోని డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమై మల్కాజిగిరి క్రాస్‌రోడ్డు వరకు కొనసాగింది. అనంతరం నిర్వహించిన సభలో ప్రజాసంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. సిపిఎం జిల్లా నాయకులు కోమటి రవి మాట్లాడుతూ, స్వాతంత్య్రానికి ముందు నుంచే కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులను హరించారని ఆరోపించారు. 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు పెంచే అవకాశం కల్పించారని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచారని, విద్యుత్ సవరణ బిల్లు–2025తో విద్యుత్ ఛార్జీలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల హామీ, నల్లధనం విషయాల్లో చేసిన ప్రకటనలు అమలు కాలేదన్నారు.సమ్మెలో వివిధ కార్మిక, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేసి కార్మికుల హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Comments