లేబర్ కోడ్లు రద్దు చేయాలి.!
సార్వత్రిక సమ్మెలో భాగంగా దమ్మపేటలో వామపక్షాల భారీ ర్యాలీ.
అశ్వారావుపేట, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం దమ్మపేట పట్టణంలో వామపక్ష పార్టీలు, కార్మిక–రైతు సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. జీడిగింజల దుకాణాల నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ చట్టం, నూతన విత్తన చట్టాలను ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ కార్మికులకు నష్టం చేసే వివిజీ రాంజీ ఉపాధి హామీ విధానాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కోరారు. పాత విధానం ప్రకారం కేంద్రం 90 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. ‘డౌన్ డౌన్ మోడీ’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్‌లో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా లక్ష్మీనారాయణ అధ్యక్షతన సభ నిర్వహించారు. సిపిఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అమర్లపూడి రాము, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి మొరంపూడి శ్రీనివాసరావు, సిపిఐ మండల కార్యదర్శి సుంకిపాక ధర్మ, సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు తదితరులు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రాధాన్యం ఇస్తూ కార్మికుల హక్కులను హరించే విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని దెబ్బతీసేలా చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు కొప్పుల శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సిహెచ్ బ్రహ్మయ్య, మొరంపూడి కేశవరావు, రావుల శోభనబాబు, పండూరి వీరబాబు, తోడెం దుర్గక్క, గంగాధర, రాఘవులు, గొర్రెపాటి బసవయ్య, పెనుబల్లి ఉదయ్, గెడ్డం రాములు, గూడెం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments