మేడ్చల్–మల్కాజిగిరిలో ప్రశాంతంగా పోలింగ్
బూతులను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
మేడ్చల్–మల్కాజిగిరి, ఫిబ్రవరి 11 (తెలంగాణ ముచ్చట్లు):
మున్సిపాలిటీలూ, మున్సిపల్ కార్పొరేషన్‌ల సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో బుధవారం పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాదు, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి, సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లీతో కలిసి సందర్శించి పరిశీలించారు.ఆలియాబాదు జిల్లా పరిషత్ హైస్కూల్, మూడుచింతలపల్లి మండలం జగ్గన్‌గూడ జిల్లా పరిషత్ హైస్కూల్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ రాజబొల్లారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులను వారు తనిఖీ చేశారు. ఓటింగ్ ప్రక్రియను సమీక్షిస్తూ ఇప్పటివరకు ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో ప్రిసైడింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, వీల్‌చైర్ సౌకర్యం, తాగునీరు, విద్యుత్ మరియు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించి, అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఓటు వేయడానికి వీల్‌చైర్‌లో వచ్చిన కిష్టమ్మ (65)ను కలెక్టర్ మను చౌదరి ఆప్యాయంగా పలకరించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేయగా, అధికారులు అభినందించారు. ప్రజలు పెద్దఎత్తున వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు పిలుపునిచ్చారు.


Comments