కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యం
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు సందర్భంగా సోమవారం వనపర్తి పట్టణంలోని 10, 11, 28, 29, 30, 31 వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల్లోకి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే మేఘారెడ్డికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు డప్పు వాయిద్యాలతో, మంగళహారతులతో, కుంకుమ తిలకం దిద్ది, పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని, రానున్న ఐదు సంవత్సరాలు కలిపి మొత్తం ఎనిమిది సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుందని తెలిపారు.అధికార పార్టీకి ఓటేస్తేనే వాడ వాడన అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.వనపర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి తానే ఉన్నానని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఎంపీగా డాక్టర్ మల్లురవి ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే పట్టణాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఇతర పార్టీల అభ్యర్థులకు ఓటేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రజలు గమనించాలని కోరారు.పది సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, కేవలం కమిషన్ల కోసం చెరువు కట్టల మరమ్మతుల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల్లోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు.వనపర్తి పట్టణంలోని 33 వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు, కాలనీల్లో విద్యుద్దీకరణ, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. 33 వార్డుల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ విజయం సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, పార్టీ పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments