వెల్టూర్‌లో ఎస్‌బీఐ వినియోగదారుల సేవా కేంద్రం ప్రారంభం
పెద్దమందడి,ఫిబ్రవరి10(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారుల సేవా కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అశోక్ ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత సులభంగా, అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్యాంకు మేనేజర్ మణిదీప్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు వేగంగా అందించడమే ఎస్‌బీఐ ప్రధాన ఉద్దేశమని, ఖాతా ప్రారంభం, నగదు లావాదేవీలు, పింఛన్ల పంపిణీ, ఆధార్–బ్యాంకు లింకింగ్ వంటి సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయని వివరించారు.గ్రామస్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ.. వెల్టూర్ గ్రామంలో ఎస్‌బీఐ వినియోగదారుల సేవా కేంద్రం ఏర్పాటు కావడం గ్రామాభివృద్ధిలో మరో కీలక అడుగుగా అభివర్ణించారు.గ్రామ ప్రజలు బ్యాంకింగ్ అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని సేవలు పొందే అవకాశం లభించిందన్నారు. ముఖ్యంగా రైతులు, వృద్ధులు, మహిళలకు ఈ కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రైతు భరోసా, పింఛన్లు, ఇతర సంక్షేమ నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న నేపథ్యంలో గ్రామంలో సేవా కేంద్రం ఉండటం ప్రజలకు మేలు చేస్తుందన్నారు.గ్రామస్తులు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంచుకుని, డిజిటల్ లావాదేవీల వైపు అడుగులు వేయాలని సూచించారు.అలాగే సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఆంజనేయులు పూర్తి పారదర్శకతతో లావాదేవీలు నిర్వహిస్తూ.. ప్రజలకు నమ్మకమైన సేవలు అందించాలని రఘుపతి రెడ్డి, బ్యాంక్ మేనేజర్ మణిదీప్ సూచించారు. ఈ సేవా కేంద్రం ద్వారా గ్రామ ఆర్థికాభివృద్ధికి దోహదం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలోగ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, మహిళా సమైక్య సిబ్బంది, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


Comments