రేషన్ దుకాణాల వద్ద పేదల బియ్యం దోపిడి – తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక కథనానికి స్పందన
రేషన్ బియ్యం విక్రయిస్తే కార్డు రద్దు
— పెద్దమందడి తాసిల్దార్ పాండు నాయక్ హెచ్చరిక
పెద్దమందడి,ఫిబ్రవరి09(తెలంగాణ ముచ్చట్లు):
"రేషన్ దుకాణాల వద్ద పేదల బియ్యం దోపిడి” అనే శీర్షికతో ఇటీవల తెలంగాణ ముచ్చట్లు దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందనగా పెద్దమందడి మండలంలో తాసిల్దార్ పాండు నాయక్ రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో రేషన్ బియ్యాన్ని బయట విక్రయించినట్లయితే సంబంధిత లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయడంతో పాటు రేషన్ డీలర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వం నిరుపేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తోందని తాసిల్దార్ తెలిపారు. అయితే కొందరు లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా బయట విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.రేషన్ లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రేషన్ బియ్యం అక్రమంగా విక్రయించినా లేదా కొనుగోలు చేసినా సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.అలాగే రేషన్ డీలర్లు పూర్తిస్థాయిలో బాధ్యతగా వ్యవహరించి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన విధంగా బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు.గతంలో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం సరఫరా జరిగేదని, ప్రస్తుతం ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం అందజేస్తోందని గుర్తుచేశారు.ఇలాంటి పరిస్థితుల్లో కూడా బియ్యం అక్రమంగా విక్రయించడం ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల సంక్షేమ పథకాలను లబ్ధిదారులు బాధ్యతగా వినియోగించుకోవాలని తాసిల్దార్ పాండు నాయక్ కోరారు.


Comments