సమ్మెతో స్తంభించిన చర్లపల్లి పారిశ్రామికవాడ
కేంద్ర కార్మిక చట్టాల రద్దుకు కార్మిక సంఘాల డిమాండ్
చర్లపల్లి, ఫిబ్రవరి 12 (తెలంగాణ ముచ్చట్లు):
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం చర్లపల్లి పారిశ్రామికవాడలో కార్మికులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన సమ్మెకు విస్తృత స్పందన లభించింది. వివిధ పరిశ్రమలకు చెందిన కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, స్కీం వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలుచోట్ల పనులు నిలిచిపోవడంతో పరిశ్రమల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జి. శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయని విమర్శించారు.విద్యుత్ (సవరణ) బిల్లు–2025, వి.బి.జి–రామ్ జి చట్టం, నూతన జాతీయ విత్తన చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని, కనీస వేతనాన్ని రూ.26 వేలుగా నిర్ణయించాలని కోరారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి చట్టబద్ధ హక్కులు కల్పించాలని, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నాయకులు పేర్కొన్నారు. ఎం.వి. యాక్ట్–2019లో ఉన్న ఇబ్బందికర నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు.‘పోరాడితే పోయేదేమీ లేదు… బానిస సంకెళ్లు తప్ప’ అంటూ కార్మికులు నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. సమ్మె శాంతియుతంగా కొనసాగినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బి.వి. సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం. శ్రీనివాస్ రావు, కొండల్ రెడ్డి, ఏఐటీయూసీ నాయకులు శంకర్ రావు, నర్సింహా, ఐఎఫ్‌టీయూ నాయకులు శివబాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ పరిశ్రమల కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


Comments