డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
తార్నాక, ఫిబ్రవరి 13 (తెలంగాణ ముచ్చట్లు):
డ్రగ్స్ రహిత సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వివేక్ పిలుపునిచ్చారు. ఈ నెల 15న సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం మరియు లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో 2కే రన్ నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేక్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలకు బానిసలై యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని వర్గాలు కఠినంగా వ్యవహరించాలని, యువతను వాటి నుండి దూరంగా ఉంచాలని సూచించారు.లంబాడీల ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ “తండాల్లో మద్యం వద్దు – విజ్ఞానం ముద్దు” అనే నినాదంతో సేవాలాల్ జయంతి సందర్భంగా ఈ రన్ నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వాలు డ్రగ్స్ నిషేధించినట్లే సంపూర్ణ మద్యపానం నిషేధించినప్పుడే సేవాలాల్ ఆశయాలు సాకారమవుతాయని అన్నారు.తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం అధ్యక్షుడు విజయ్ నాయక్ మాట్లాడుతూ సద్గురు సేవాలాల్ చూపిన శాంతి మార్గం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన విద్యా సంకల్పం సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లంబాడి ఐక్యవేదిక ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు రాజేష్ చౌహాన్, పలు విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments