ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ

ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ

•ఆంధ్రాలో కలిసిన 5 పంచాయతీలను తిరిగి తెలంగాణాకు ఇవ్వడి

•తిరుమలలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం కేటాయింపుకు విజ్ఞప్తి 

•తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం

•సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల కీలక చర్చలు

ఖమ్మం బ్యూరో, ఫిబ్రవరి 16(తెలంగాణ ముచ్చట్లు)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్‌లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రాంతాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పునర్విభజనలో తలెత్తిన పరిపాలనా సమస్యల నుంచి సాగునీటి ప్రాజెక్టులు, దేవస్థానాల అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణం వరకు విస్తృత అంశాలపై మంత్రి విజ్ఞప్తులు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
పునర్విభజనలో కలిసిన 5 గ్రామాలు… తెలంగాణలో విలీనం చేయాలి
రాష్ట్ర విభజన సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలానికి ఆనుకుని ఉన్న యేటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామపంచాయతీలు ఆంధ్రప్రదేశ్‌లో కలిసిపోయిన విషయాన్ని మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
భౌగోళికంగా ఇవి తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండటంతో ప్రజలు పరిపాలనా పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. జిల్లా కేంద్రాలకు చేరుకోవడానికి దాదాపు 8 గంటలు ప్రయాణించాల్సి వస్తోందని, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, పన్నులు, పరిపాలనా అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు గిరిజన ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.
గోదావరి నది, అటవీ ప్రాంతాల మధ్య ఈ గ్రామాలు ఎంక్లేవ్‌లా మారిపోయాయని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం దేవస్థాన పరిపాలనలో ఇబ్బందులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబంధించిన కొంత భూభాగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో దేవస్థానం పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలంటే ఈ గ్రామాల విలీనం కీలకమని అభిప్రాయపడ్డారు.
పెద్దవాగు ప్రాజెక్ట్‌కు 85:15 నిష్పత్తిలో నిధులు
ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మత్తులు అత్యవసరమని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, అందులో 13,640 ఎకరాలు (85.25%) ఆంధ్రప్రదేశ్‌లో, 2,360 ఎకరాలు (14.75%) తెలంగాణలో ఉన్నాయని వివరించారు.
ప్రాజెక్ట్ పునరుద్ధరణకు రూ.92.20 కోట్ల వ్యయం అంచనా వేయబడిందని, రెండు రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల జీవనాధారం ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడినందున తక్షణ ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
భద్రాచలం వరద రక్షణ కరకట్టకు తక్షణ మరమ్మత్తులు
ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న గోదావరి వరద రక్షణ కరకట్టలో 3వ స్లూయిస్ వద్ద గోడ దెబ్బతిన్న అంశాన్ని మంత్రి ప్రస్తావించారు. భద్రాచలం పట్టణాన్ని వరదల నుంచి రక్షించేందుకు నిర్మించిన ఈ కరకట్టలో ఏర్పడిన నష్టం భవిష్యత్తులో ప్రమాదానికి దారితీయొచ్చని హెచ్చరించారు.
విభజన అనంతరం ఆ భాగం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్లడంతో నిర్వహణలో సమస్యలు తలెత్తాయని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వెంటనే సాంకేతిక పరిశీలన చేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రెండు రాష్ట్రాల సమన్వయంతో శాశ్వత పునరుద్ధరణ ప్రారంభించాలని కోరారు.
ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి విజ్ఞప్తి
ఖమ్మం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి గుర్తింపు పూర్తయిందని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనులు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు. స్థానిక భక్తుల దీర్ఘకాలిక ఆకాంక్షను నెరవేర్చే దిశగా ప్రభుత్వం సహకరించాలని అభ్యర్థించారు.
తిరుమలలో తెలంగాణకు 5 ఎకరాల స్థలం
తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ప్రత్యేక యాత్రికుల భవనం నిర్మాణానికి సుమారు 5 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రి ప్రతిపాదించారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో వసతి కొరత తగ్గి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించవచ్చని పేర్కొన్నారు.
రైల్వే లైన్ల నిర్మాణానికి సహకారం కోరిన మంత్రి
సత్తుపల్లి–కొవ్వూరు రైల్వే లైన్, పెనుబల్లి–అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ లైన్లు అమలులోకి వస్తే వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.
సమన్వయంతో ముందుకు…
సాగునీరు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల విస్తరణలో రెండు రాష్ట్రాలు పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగితే వేగవంతమైన పురోగతి సాధ్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.IMG-20260216-WA0104

Tags:

Post Your Comments

Comments

Latest News

మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం మల్లాపూర్‌లో చాందిని క్రికెట్ టోర్నమెంట్ ఘన ప్రారంభం
మల్లాపూర్, ఫిబ్రవరి 16 (తెలంగాణ ముచ్చట్లు) ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టిఆర్ నగర్ బండబావి కమ్యూనిటీ హాల్‌లో పరమేశ్వర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన...
మూడుసార్లు వార్డు నెంబర్ గా గెలుపొందిన... మాదినేని సునీత  
వైరాను మోడల్ మున్సిపాలిటీగా   తీర్చిదిద్దుతా  బాధ్యత నాదే..
ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
కాప్రా సర్కిల్‌లోని శ్రీ తులజా భవాని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా
వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవిని కలిసిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు
పేద విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం