కమలానగర్‌లో జాతీయ విజ్ఞాన దినోత్సవం వేడుకలు
కమలానగర్, ఫిబ్రవరి 28 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా సైంటిఫిక్ టెంపర్ ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం కమలానగర్ కార్యాలయంలో నిర్వహించారు. సి వి రామన్ ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్‌ను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఈ సందర్భంగా సి.వి. రామన్ చిత్రపటానికి స్ఫూర్తి గ్రూప్ నాయకురాలు అనురాధ, ప్రముఖ రచయిత బంగారు ఆచార్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంగారు ఆచార్యులు మాట్లాడుతూ, సి.వి. రామన్ భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయ శాస్త్రవేత్త అని పేర్కొన్నారు. 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న ఆయనకు ఇంగ్లాండ్ ప్రభుత్వం “సర్” బిరుదు, భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రదానం చేసిన విషయాలను గుర్తుచేశారు.అనురాధ మాట్లాడుతూ, కాంతి కిరణాలపై సి.వి. రామన్ చేసిన పరిశోధనలు వైద్య రంగం నుంచి అంతరిక్ష రంగం వరకు విస్తృత ప్రయోజనాలను అందించాయని తెలిపారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.గుమ్మడి హరిప్రసాద్, నవతెలంగాణ రవి, రుక్కయ్య, యాదగిరిరావు తదితరులు ప్రసంగించారు. శాస్త్రవేత్తలకు జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు. గత మూడు రోజులుగా వివిధ విద్యాసంస్థల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్ఫూర్తి గ్రూప్ అధ్యక్షుడు యాదగిరిరావు తెలిపారు.కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఎన్. శ్రీనివాస్, గౌసియా, లక్ష్మయ్య, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments