అగ్రకుల కులోన్మాదం అరికట్టకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది
బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్
హైదరాబాద్,ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలో కులోన్మాదం అంచలంచెలుగా పెరుగుతోందని, దీనిని తక్షణమే అరికట్టకపోతే రాష్ట్రం బహుజనుల చేతిలో అగ్నిగుండంగా మారే పరిస్థితులు ఏర్పడతాయని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్ హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో అగ్రకుల దాడిలో మృతి చెందిన చిన్నారి మౌనికకు నివాళిగా ఎల్బీనగర్ చౌరస్తాలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మాదిగ యువజన సంయుక్త చర్యా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి తెలంగాణ జన జాతికిపురం అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి, జై భారత్ రాష్ట్ర కన్వీనర్ ముప్పారం ప్రకాష్, రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు అలిగే జీవన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బోరెల్లి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అగ్రకుల అహంకారంతో రజకులపై జరిగిన దాడి అత్యంత దుర్ఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణం కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఆలయ నిర్వహణ బాధ్యతలు రజక కుటుంబానికి అప్పగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన మహాశక్తి రాష్ట్ర అధ్యక్షుడు చందర్ నాయక్, ఆర్పి పార్టీ రాష్ట్ర నాయకుడు అలిగే జీవన్, కాంగ్రెస్ నాయకులు బాలన్న, దేవని శేఖర్, బాలస్వామి సుధీర్ తదితరులు పాల్గొన్నారు.


Comments